ప్రభుత్వ క్వార్టర్‌లోనే యువతిపై ఖాకీచకం..
భువనేశ్వర్ : ప్రభుత్వ క్వార్టర్‌లోనే ఓ యువతిపై మాజీ పోలీస్ కానిస్టేబుల్ అతని సహచరులు సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. పూరిలోని జధేశ్వరి ఆలయ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌లో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపార బస్ స్టేషన్‌లో బస్ కోసం వేచిచూస్తున్న బాలికను తాను పోలీస్ అధికారినని గుర్తింపు కార్డు చూపి సాయం చేస్తానని గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన నిందితుడు నమ్మబలికాడు. అతడి సాయం తీసుకునేందుకు బాలిక నిరాకరించగా నిందితుడు తనతో పాటు ఉన్న మరికొందరితో కలిసి బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పూరిలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఇద్దరు వ్యక్తులు బయట నుంచి క్వార్టర్స్ తలుపులకు తాళం వేయగా, మరో ఇద్దరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు మద్యం సేవించి నిద్రించగా తాను వేరొక వ్యక్తి సాయంతో కిటికీ నుంచి దూకి బయటకు వచ్చానని ఆమె చెప్పారు. ఐడీ కార్డు ఆధారంగా నిందితుడు మాజీ పోలీస్ కానిస్టేబుల్ జితేంద్ర సేథిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.