సెబీ చైర్మన్‌ పోస్టుకు దరఖాస్తుల వెల్లువ

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) చైర్మన్‌ పోస్ట్‌కు రెండు డజన్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో సెబీ హోల్‌టైం ఇద్దరు సభ్యులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తుకు చివరి రోజు ఈ నెల 10. ప్రస్తుతం పలు సేవలు అందిస్తున్న వారితోపాటు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లు కూడా ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అజయ్‌ త్యాగీ ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయబోతున్నారు. 2017లో నియమితులైన త్యాగీ ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగారు. త్యాగీ స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని ఎఫ్‌ఎస్‌ఆర్‌ఏఎస్‌సీ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనున్నది.