యెస్‌ బ్యాంక్‌ ఏటీఎంలలో నగదు కొరత

 తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 3 వరకు బ్యాంకుపై ఆంక్షలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆ బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలని వెళ్తున్న వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పలు యెస్‌ బ్యాంక్‌ ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడగా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 


ఘజియాబాద్‌లోని ఓ ఏటీఎం ఎదుట కస్టమర్లు బారులు తీరగా అందులో నగదు అయిపోయింది. అలాగే ఢిల్లీలోని ఓ ఏటీఎం నుంచి కేవలం రూ.4వేల వరకు మాత్రమే నగదు విత్‌డ్రా అవుతుందని కస్టమర్లు మీడియాకు తెలిపారు. ఇక చాలా మంది యెస్‌ బ్యాంక్‌ కస్టమర్లు తమ మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు పనిచేయడం లేదని, కొందరి క్రెడిట్‌ కార్డులు కూడా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే సమస్యపై స్పందించిన బ్యాంక్‌ అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్‌ 3వ తేదీ వరకు అంతా సర్దుకుంటుందని, అప్పటి వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసేందుకు బ్యాంకు బ్రాంచ్‌లు నిత్యం పనిచేస్తాయని చెబుతున్నారు. ఇక మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా యెస్‌ బ్యాంకు కస్టమర్ల డబ్బు సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు నుంచి కేవలం రూ.50వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ బ్యాంకు ఏటీఎంలలో నగదు కొరత సమస్య ఏర్పడడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నది..!