కరోనాతో కుదేలవుతున్న అమెరికా.. ఒకేరోజు 884 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5300కు చేరింది. గత 24 గంటల్లో 884 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అలసత్వం ప్రదర్శించిన ఇటలీ, స్పెయిన్‌ సరసన అమెరికా చేరింది. ఈ మూడు దేశాలు మృతుల సంఖ్యలో కరోనా వైరస్‌ పుట్టిళ్లు చైనాను ఎప్పుడో అధిగమించాయి. అదేవిధంగా కరోనా కేసుల సంఖ్యలో కూడా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో 2,27,000 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్‌ అమెరికా ఆర్థికవ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో రవాణాతో సహా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో తమకు నిరుద్యోగ ప్రయోజనాలు చెల్లించాలని 6.6 మిలియన్ల అమెరికన్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.